: మరో నాలుగేళ్లలో ప్రతి పదిమంది ఉద్యోగుల్లో నలుగురు ఇంటికే!


మరో నాలుగేళ్లలో అంటే 2021 నాటికి ప్రతి పది ఉద్యోగాల్లో నాలుగు ఊడిపోనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. యాంత్రీకరణ ఉపాధి అవకాశాలను దారుణంగా దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెరగాల్సి ఉండగా ఆటోమేషన్ ప్రభావంతో ఉన్న ఉద్యోగాలే పోయే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికే ఇంజినీరింగ్, మాన్యుఫేక్చరింగ్, ఆటోమొబైల్స్, ఐటీ, బ్యాకింగ్ రంగాల్లో ఆటోమేషన్ అడుగుపెట్టేసిందని, ఇది మరింత పెరుగుతున్న కొద్దీ దిగువ స్థాయి ఉద్యోగులపై వేటు పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరో మూడు నాలుగేళ్లలో ఆటోమేషన్ పరంగా చెప్పుకోదగ్గ మార్పులు కనిపిస్తాయని  పీపుల్‌ స్ట్రాంగ్‌ సీఈవో పంకజ్‌ బన్సాల్‌ పేర్కొన్నారు. ఆటోమేషన్ ప్రభావం ఎక్కువగా ఐటీ, దాని ఆధారిత రంగం, తయారీ, వ్యవసాయ రంగం, సెక్యూరిటీ సేవలపై ఉంటుందని తెలిపారు.

 ఇక ఆటోమేషన్ ప్రభావం భారత్‌పైనా తీవ్రంగా పడనుంది. 2021 నాటికి యాంత్రీకరణ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది ఉద్యోగాల్లో నాలుగు మాయమవుతాయి. ఈ నాలుగింటిలో ఒకటి భారత్ నుంచే ఉంటుందని అంచనా. దీని ప్రకారం ఒక్క భారత్‌లో 23 శాతం ఉద్యోగాలు పోతాయన్నమాట. దేశంలో ప్రతి ఏడాది 55 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తున్నా వాటిని భర్తీ చేసేందుకు నైపుణ్యాల లేమి అడ్డంకిగా మారుతోందని పంకజ్ తెలిపారు. ఈ కారణంగా ఉద్యోగాల భర్తీ అనుకున్నంత స్థాయిలో ఉండడం లేదని, యాంత్రీకరణ  దీనిని మరింత పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆటోమేషన్‌తో అన్ని ఉద్యోగాలకు ముప్పు ఉండదని కెల్లీ ఓసీజీ ఇండియా దేశీయ డైరెక్టర్ ప్రాన్సిస్ పదమదన్ అభిప్రాయపడ్డారు. యంత్రాల పర్యవేక్షణకు కూడా ఉద్యోగుల అవసరం ఉంటుందని, అయితే దిగువస్థాయి ఉద్యోగులకు మాత్రం ముప్పు పొంచి ఉంటుందని  ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News