: స్పీల్ బర్గ్ మన బాహుబలి సినిమాను చూసి మాట్లాడాలి!: కృష్ణంరాజు
సంతోషకరమైన ఈ ఆనంద సమయంలో ఏం మాట్లాడాలో తెలియడం లేదని ప్రముఖ నటుడు కృష్ణంరాజు తెలిపారు. కీరవాణి, విజయేంద్రప్రసాద్, రాజమౌళిని చూసి గర్వంగా ఉంటుందని అన్నారు. ఒకసారి స్టీవెన్ స్పిల్ బర్గ్ ను ఒక ఇంటర్వ్యూలో భారతీయ సినీ పరిశ్రమ గురించి అడిగితే దానిని పట్టించుకోలేదట... మళ్లీ మళ్లీ అడగడంతో ఆయన సమాధానం చెబుతూ... భారతీయ సినీ పరిశ్రమ ఒకే కథతో ఇన్ని సినిమాలు ఎలా తీయగలుగుతోందో తనకు అర్ధం కాదని అన్నారట... ఇప్పుడు 'బాహుబలి' సినిమాను చూసి మాట్లాడమని ఆయనకు చెబుతానని కృష్ణంరాజు అన్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లో ఓ ప్రచార సభలో తాను కట్టప్పలాంటి వ్యక్తినని అన్నారంటే ఈ సినిమా ప్రభావం ఎలాంటిదో గుర్తించాలని ఆయన చెప్పారు.
'బాహుబలి' సినిమాలో 'శివగామి' పాత్ర ఎంత ప్రధానమైనదో... ఈ సినిమా ఇలా రావడం వెనుక వల్లి, రమ, ప్రశాంతి శ్రమ ఎంతో ఉందని ఆయన చెప్పారు. వారు ముగ్గురికీ తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని ఆయన చెప్పారు. నాలుగేళ్లు ప్రభాస్ ను రాజమౌళికి అప్పగించామని ఆయన చెప్పారు. రాజమౌళిపై ఉన్న నమ్మకమే అలా చేసిందని, ఆ నమ్మకం ఈ సినిమా రిలీజైన అనంతరం నిరూపితమైందని ఆయన తెలిపారు. ట్రైలర్ చూసి కథను ఊహించవచ్చని ఆయన తెలిపారు. ట్రైలర్ లో 'శివగామి' అంతర్యుధ్ధం అంటుంది... 'బాహుబలి' 'నువ్వుండగా నన్ను చంపే మగాడు పుట్టలేదు మామా' అంటాడు... రక్తం చిందుతుంది...కథ ఇంకా అర్ధం కాలేదా? అని ఆయన అభిమానులను అడిగారు.