: అలా కాకపోతే డార్లింగ్ ప్రభాస్ ను ఎవరు చంపుతారు చెప్పండి?: 'కట్టప్ప' సత్యరాజ్
తన 40 ఏళ్ల సీనీ ప్రస్థానంలో 250 సినిమాలు చేశానని, అయితే 'బాహుబలి' సినిమా చాలా ప్రత్యేకమైనదని ప్రముఖ నటుడు సత్యరాజ్ తెలిపారు. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన 'బాహుబలి- ది కన్ క్లూజన్' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, తమిళనాడు మినహా భారతదేశం మొత్తం మీద తన పేరు కట్టప్ప అయిపోయిందని ఆయన అన్నారు. అలా పిలిపించుకుంటున్నందుకు తనకు చాలా గర్వంగా కూడా ఉందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా యాంకర్ సుమ కల్పించుకుని, 'బాహుబలిని ఎందుకు చంపారో తెలుసా?' అని అడగడంతో.... తనకు 'తెలుస'ని అన్నారు. తనకు నిర్మాతలు బాగా డబ్బులిచ్చారని, దర్శకుడు రాజమౌళి చంపమన్నారని, అందుకే 'బాహుబలి'ని చంపేశానని ఆయన చెప్పారు. అలా కాకపోతే డార్లింగ్ ప్రభాస్ ను ఎవరు చంపుతారని ఆయన చెప్పారు. అదీకాక ప్రభాస్ తో తనకు ఇది మొదటి సినిమా కాదని, 'మిర్చి'లో తండ్రీ కొడుకులుగా తామిద్దరం ప్రేక్షకులను అలరించామని గుర్తు చేశాడు.