: చంద్రబాబు తండ్రిలాంటివారు... ఆయన మమ్మల్ని సరైన దారిలో నడిపిస్తారు: ఎంపీ కేశినేని నాని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నిన్న ఆర్టీఏ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటన గురించి వివరించామని ఎంపీ కేశినేని నాని తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో పాటు తాను సీఎంను కలిశానని అన్నారు. ఈ సమయంలో ఆయన వెళ్లి ఆర్టీఏ కమిషనర్ కు క్షమాపణలు చెప్పాలని ఆదేశించారని అన్నారు. ఆయన తమకు తండ్రిలాంటివారని అన్నారు. ఆయన తమను మందలించాడన్నా, తమపై ఆగ్రహం వ్యక్తం చేశాడన్నా తప్పులేదని ఆయన చెప్పారు.
తాము మాత్రం ఆయన తమకు సరైన దారి (డైరెక్షన్) చూపించారని భావిస్తున్నామని అన్నారు. పిల్లలు తప్పు చేస్తే తండ్రి ఎలా మందలిస్తాడో అలాగే చంద్రబాబు తమను సరైన దారిలో నడిచేలా చేశారని చెప్పారు. అందుకే తాము నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశామని చెప్పారు. జరిగిన ఘటన వల్ల వేరే ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నాయని అంటే తాము వారికి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని అన్నారు. దీంతో వివాదం ముగిసిందని ఆయన చెప్పారు.