: 'మా ఇల్లు, మా ఇల్లు అంటూ నా కూతుర్నే కొట్టేశావు కదా!'... లోకేష్ తో బాలకృష్ణ మాటల్ని గుర్తు చేసుకున్న బ్రాహ్మణి


సినీ హీరోకు కూతురిగా, ఓ ముఖ్యమంత్రికి కోడలిగా, ఓ యువనేతకు భార్యగా, వ్యాపారాన్ని చక్కగా నిర్వహిస్తోందన్న పేరు తెచ్చుకున్న నారా బ్రాహ్మణి, ఓ తెలుగు దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, పలు సరదా విషయాలను వెల్లడించింది. లోకేష్ తో తన వివాహం అయిన తరువాత, తన తండ్రి తరచూ ఓ మాట అంటుండేవారని చెబుతూ, "నా ఇల్లూ, నా ఇల్లూ అంటూ నా కూతుర్నే కొట్టేశావు కదా?" అని ఆయన అనేవారని గుర్తు చేసుకున్నారు. ఈ మాటలు ఎందుకు అంటారన్న విషయమై వివరణ ఇస్తూ, హైదరాబాద్ లో తమ కుటుంబం ఉండే ఇంట్లో అంతకుముందు, మామయ్య, అత్తయ్య, లోకేష్ ఉండేవారని, తన తండ్రి చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన తరువాత, ఆ ఇంట్లోకి తాము వెళితే, మావయ్య వాళ్లు మరో ఇంటికి మారారని చెప్పారు.

చిన్నప్పుడు లోకేష్ తమ ఇంటికి వచ్చినప్పుడల్లా, ఇద్దరమూ అది మా ఇల్లంటే, మా ఇల్లని కొట్టుకునేవాళ్లమని అన్నారు. తాను కడుపులో ఉన్న సమయంలోనే తనను చూడాలని లోకేష్ పదే పదే అడుగుతుండేవాడని, పాపను చూపించమని గోల చేసేవాడని అమ్మ చెప్పేదని మురిపెంగా చెప్పుకొచ్చారు బ్రాహ్మణి. ఆపై పందొమ్మిది సంవత్సరాల తరువాత, లోకేష్ తో పెళ్లి అనగానే కంగారు పడ్డానని, ఆపై ఇద్దరమూ మాట్లాడుకున్న తరువాత, తమ ఆలోచనలు, అభిప్రాయాలు ఒకటేనని అర్థమైందని అన్నారు.

  • Loading...

More Telugu News