: నేడు 'బాహుబలి' డే... ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయంటే..!
నేడు జరగనున్న 'బాహుబలి: ది కన్ క్లూజన్' ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీలోని మాహిష్మతి సెట్ వేదికగా, మునుపెన్నడూ జరగని రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు దాదాపు 500 మందికి పైగా నిపుణులైన కార్మికులు శ్రమిస్తున్నారు. చిత్ర దర్శకుడు రాజమౌళి స్వయంగా ప్రీ రిలీజ్ వేడుక సెట్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
చుట్టూ మాహిష్మతి సామ్రాజ్యం కనిపించేలా, ఎత్తైన భవంతులు, జలపాతాన్ని తీర్చిదిద్దారు. తొలి భాగంలో భల్లాలదేవుని బంగారు విగ్రహాన్ని ప్రతిష్టించిన ప్రాంతం ముందు ఈ వేడుక జరగనుంది. అతిథులు కూర్చునేందుకు మామూలు కుర్చీలు కాకుండా, సింహాసనం లాంటి కుర్చీలను ఏర్పాటు చేశారు. అతిథులకు ఆనందాన్ని పంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలనూ ఏర్పాటు చేశారు. ముంబై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన డ్యాన్సర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్న ఈ కార్యక్రమాన్ని పలు టీవీ చానళ్లు లైవ్ లో ప్రసారం చేయనున్నాయి.