: జలియన్ వాలాబాగ్ ఉదంతంతో ప్రభావితమైన పన్నెండేళ్ల బాలుడు, జాతి మరువని వీరుడు: మన్ కీ బాత్ లో మోదీ
ఆకాశవాణి మాధ్యమంగా తన 30వ 'మన్ కీ బాత్' ప్రసంగాన్ని వినిపించిన ప్రధాని నరేంద్ర మోదీ, స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ను తలచుకుంటూ మాట్లాడారు. భగత్ సింగ్ తో పాటు సుఖ్ దేవ్, రాజ్ గురూలు మరణానికి భయపడలేదని, వారు కేవలం భౌతికంగా దూరమయ్యారని చెప్పారు. దేశం కోసం మరణించిన వారిని జాతి ఎన్నటికీ మరువదని అన్నారు. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణహోమం, 12 ఏళ్ల ఓ బాలుడి మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని, అతనే భగత్ సింగని చెప్పారు.
బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, బంగ్లా వాసులు భారతీయులకు మిత్రులని, ఉపఖండంలో శాంతి, భద్రతలకు బంగ్లాదేశ్ కీలకమని అన్నారు. 'భవ్య, దివ్య భారత్' నిర్మాణానికి 125 కోట్ల మంది భారతీయుల నైపుణ్యత, బలం అవసరమని వ్యాఖ్యానించారు. రాజకీయాలను పక్కనపెట్టి కృషి చేస్తేనే నవ్య భారతావనిని సృష్టించవచ్చని అన్నారు. భారత ప్రజలు అవినీతికి, నల్లధనానికి వ్యతిరేకమని తేల్చి చెప్పారని, డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహిస్తామని మోదీ తెలిపారు.