: తమిళనాడు సముద్ర తీరంలో మరకతలింగం.. విచారణ చేపట్టిన అధికారులు
తమిళనాడులోని ఎన్నూర్ సముద్ర తీరంలో విలువైన మరకత లింగం లభ్యమైనట్టు వస్తున్న వార్తలపై అధికారులు స్పందించారు. వదంతులపై విచారణ చేపట్టారు. ఇటీవల తిరువళ్లూరు జిల్లా ఎన్నూరు సముద్రతీరంలో రెండు పడవలు ఢీకొన్నాయి. చమురు లీకవడంతో జాలర్లు వేట నిలిపివేశారు. శుక్రవారం సాయంత్రం సముద్ర తీరంలోని చమురు తెట్టును తొలగిస్తుండగా పెరియ కాశికుప్పానికి చెందిన జాలరి అశోక్‌కు ఓ శివలింగం కనిపించింది.
దాదాపు అరకేజీ బరువు, పది సెంటీమీటర్ల ఎత్తులో ఉన్న అది మరకత లింగమేనని జాలరి గుర్తించాడు. విషయం తెలిసిన జాలర్ల కుటుంబాలు దానికి పూజలు నిర్వహించాయి. విషయం ఆ నోట, ఈనోట పాకడంతో స్పందించిన మత్స్యశాఖ అధికారులు శివలింగాన్ని స్వాధీనం చేసుకుని తిరువొత్తియూర్ తహసీల్దార్ సెంథిల్‌నాథన్‌కు అప్పగించారు. పురావస్తు శాఖ అధికారుల పరిశీలన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తహసీల్దార్ తెలిపారు.