: రికార్డు సృష్టించనున్న లోకేశ్, అఖిలప్రియ.. మంత్రులుగా పిన్నవయస్కులు.. వచ్చే నెలలో ముహూర్తం?


టీడీపీ నేతలు నారా లోకేశ్, భూమా అఖిలప్రియలు రికార్డు సృష్టించనున్నారు. ఏప్రిల్‌లో జరిగే ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో వీరికి చోటుదక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీ కేబినెట్‌లో అత్యంత పిన్నవయసు మంత్రులు వీరే అవుతారు. వీరిలో లోకేశ్ కన్నా అఖిలప్రియ వయసు ఇంకా తక్కువ. అంతేకాదు లోకేశ్ కంటే కూడా ఆమె సీనియర్ కూడా. లోకేశ్ ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా, అఖిల 2014లో జరిగిన ఉప ఎన్నికలో ఆళ్లగడ్డ నుంచి గెలుపొందారు. లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు కూడా సంకేతాలు ఇచ్చారు.

తండ్రి నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాలపై అఖిలప్రియ పెద్దగా దృష్టి సారించలేదు. అయితే ఇటీవల తండ్రి ఆకస్మిక మరణంతో తన నియోజకవర్గంతోపాటు తండ్రి నియోజకవర్గమైన నంద్యాలలో కూడా పార్టీ మంచి, చెడులను చూసుకోవాల్సిన భారం ఆమెపై పడింది. దీంతో ఆమె మానసికంగా సిద్ధమయ్యారు. అఖిలప్రియ మానసిక స్థైర్యం చంద్రబాబును సైతం ఆకట్టుకుంది. నాగిరెడ్డి లేని లోటును అఖిల తీరుస్తారని చంద్రబాబు స్వయంగా పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే బహిరంగంగా ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. భూమాను మంత్రివర్గంలోకి తీసుకోవాలని బాబు భావించారని, ఆయన లేకపోవడంతో ఇప్పుడు అఖిలప్రియకు ఆ అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని సీనియర్ నేతలు చెబుతున్నారు. లోకేశ్, అఖిలప్రియలకు కేబినెట్‌లో చోటుకల్పిస్తే చంద్రబాబు మంత్రివర్గంలో వారే అత్యంత పిన్నవయస్కులు అవుతారు.

  • Loading...

More Telugu News