: దోమలు పెంచితే ఊచలు లెక్కించాల్సిందే!.. త్వరలో ఏపీలో కొత్త చట్టం
దోమలేంటి?.. పెంపకం ఏంటి? జైలేంటి?.. అని ఆశ్చర్యపోతున్నారా? మరీ అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దోమలు పెంచితే నిజంగానే ఊచలు లెక్కపెట్టుకోవాల్సి వస్తుంది. అంతేకాదు భారీ జరిమానా కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. దోమల పెంపకం ఏంటి? అని తలబద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు. దోమల పెంపకం అంటే.. దోమలు పెరిగేందుకు అనువుగా అవకాశాలు సృష్టించడం.. అంటే ఇళ్ల పక్కన, రహదారుల పక్కన, తోపుడు బళ్లు పరిసర ప్రాంతాల్లో దోమలు పెరిగే వాతావరణం సృష్టిస్తే తొలిసారి వెయ్యి రూపాయలు, రెండోసారీ అదే తప్పు చేస్తే రూ.5 వేలు జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోమల నియంత్రణకు కొత్త చట్టం తీసుకురాబోతోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. త్వరలోనే బిల్లు చట్టంగా మారనుంది.
ఈ చట్టం ప్రకారం దోమగుడ్ల నివారణకు ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా చర్యలు తీసుకోకుంటే రోజుకు వంద రూపాయల చొప్పున జరిమానా కట్టాల్సి ఉంటుంది. దోమల గుడ్ల పెరుగుదలకు కారణమయ్యే ఖాళీ స్థలాలు, హోటళ్లు, ఆహార నిల్వ సంస్థలు, భవన నిర్మాణ సంస్థలు, కల్యాణ మండపాలు, విద్యాసంస్థలు, మైనింగ్ ప్రాంతాలకు తొలిసారి రూ.25 వేలు, రెండోసారి రూ.50 వేలు ఫైన్ విధిస్తారు. అంతేకాదు నెల రోజుల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకూ ఇదే నియమం వర్తిస్తుంది. దోమల నివారణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన స్థానిక సంస్థల చైర్మన్లు, అథారిటీపైనా కేసులు నమోదు చేస్తారు.