: బాత్రూమ్ తలుపు వేయనందుకు గొడవ.. విద్యార్థి మృతి
బెంగళూరులోని బ్యాడరహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హాస్టల్లో విద్యార్థుల మధ్య చెలరేగిన చిన్న గొడవ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. నెలమంగల పరిధిలోని సోలూరు ప్రాంతానికి చెందిన రోహిత్(20) ఈస్ట్‌వెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ విద్యార్థి. ఆయన దేవరాజ్ అరసు హాస్టల్లో తన తోటి విద్యార్థి అమరేశప్పతో పాటు విజయనగర ప్రభుత్వ కళాశాల విద్యార్థి రవీశ్‌తో కలిసి అదే హాస్టల్లో ఉంటున్నాడు. అయితే, రాత్రిపూట మద్యం తాగి వచ్చిన రవీశ్ బాత్రూమ్కు వెళ్లి తలుపు వేసుకోకుండా మూత్రం చేస్తున్నాడు. అయితే, అదే సమయంలో తలుపు వేసుకోవాలని రోహిత్, అమరేశ్లు చెప్పారు.
దీంతో గొడవ మొదలై తన్నుకున్నారు. ఆవేశంతో ఊగిపోయిన రవీశ్ గదిలోకి వెళ్లి కత్తి తీసుకొని రోహిత్ గొంతుపై పొడిచాడు. అడ్డువచ్చిన అమరేశ్‌పై కూడా దాడి చేశాడు. గమనించిన హాస్టల్ సిబ్బంది వారిని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం రోహిత్‌ను ఆ ఆసుపత్రి నుంచి విక్టోరియా ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రవీశ్‌ను అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.