: ఆ బాధ పడలేక నన్ను చంపేయండని పాక్ సైనికులను వేడుకున్నాను!: పాక్ లో నరకాన్ని చూసిన భారత సైనికుడు
పాకిస్థాన్ భూభాగంపై భారత సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన 29 సెప్టెంబర్ 2016 నాడు.. పొరపాటున నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్ లో అడుగుపెట్టి అక్కడి సైనికులకు పట్టుబడ్డ భారత సైనికుడు చందూ బాబూలాల్ చవాన్ పాక్ లో చవిచూసిన నరకం గురించి వివరించారు.
'నేను పాక్ సైనికులకు చిక్కిన తరువాత నన్ను పూర్తిగా తనిఖీ చేశారు. నా దుస్తులు తీసుకున్నారు. నా మీద నల్లటి దుస్తులు వేసి, ఓ వాహనంలో తీసుకెళ్లారు. తరువాత నన్ను ఒక చీకటి గదిలో బంధించారు. బాత్ రూమ్, టాయ్ లెట్ కూడా ఆ గదిలోనే ఉన్నాయి. ఇంజెక్షన్లు చేసి నన్ను కొట్టేవారు. నా చెవిలో డ్రాప్స్ వేసేవారు. దీంతో భరించలేని బాధతోపాటు రక్తం కూడా వచ్చేది. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. వారి చిత్రహింసలు భరించలేక తల బాదుకునేవాణ్ని. నన్ను చంపేయమని ఎన్నోసార్లు వారికి చెప్పాను. చీకటి గదిలో ఉంచడంతో ఏది రాత్రి? ఏది పగలు? అన్న విషయం కూడా తెలిసేది కాదు. అలాంటప్పుడు నా కుటుంబం గుర్తుకు వచ్చి దుఃఖం పొంగుకొచ్చేది. వారు నన్ను చంపరు... అదే సమయంలో హింసించడం ఆపరు... దీంతో దేవుడా నన్ను తీసుకుపో అంటూ ప్రతిరోజూ దేవుడ్ని కోరుకునే వాడిని' అని ఆయన తెలిపారు. కాగా, ఆయనను భారత ప్రభుత్వం ఒత్తిడితో జనవరి 21న మన దేశానికి అప్పగించారు.