: ఎన్టీఆర్ ని చూశా, చంద్రబాబుని చూశా... కేసీఆర్, నీవెంత?: వీహెచ్ తీవ్ర ఆగ్రహం
అసెంబ్లీ అనేది స్పీకర్ పరిధిలో ఉంటుందని... అక్కడ పోలీసుల పెత్తనం ఏందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకుడినైన తనను అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడనివ్వకపోవడం ఏంటని మండిపడ్డారు. తాను మాట్లాడకూడదనే ఉత్తర్వులను స్పీకర్ ఇచ్చుంటే వాటిని చూపించాలంటూ పోలీసులను కోరారని... స్పీకర్ ఉత్తర్వులు చూపిస్తే తాను వెళ్లిపోయేవాడినని... అయినా వారు రాద్ధాంతం చేశారని చెప్పారు. సీఐని తాను ఏమీ అనలేదని... బూతులు తిట్టలేదని తెలిపారు. తాను సీఐని తిట్టినట్టు నిరూపిస్తే... రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నట్టుందని అసహనం వ్యక్తం చేశారు.
బీసీల గురించి తాను మాట్లాడుతున్నందుకే ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని వీహెచ్ ఆరోపించారు. గొర్రెలు మాకు, రాజ్యాధికారం మీకా? అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన నోరు నొక్కే ప్రయత్నాన్ని కేసీఆర్ చేస్తున్నాడంటూ విమర్శించారు. ఎన్టీఆర్ ని చూశా, చంద్రబాబును చూశా... కేసీఆర్, నీవెంత? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై పోలీసు కేసును ఓ సాధారణ పోలీసు అధికారి పెట్టలేడని... దీని వెనుక ముమ్మాటికీ ప్రభుత్వ హస్తం ఉందని చెప్పారు.