: మా దేశంలో నువ్వెందుకున్నావ్...లెబనాన్ వెళ్లిపో!: అమెరికాలో సిక్కు యువతిపై జాతి విద్వేష వ్యాఖ్యలు
అమెరికాలో సిక్కు-అమెరికన్ యువతికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విదేశీయులనిపించిన వారిపై జాతి విద్వేష దాడులు, వేధింపులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా దక్షిణాసియా వాసులపై ఈ వేధింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా మన్ హట్టన్ లో తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు ట్రైన్ లో బయల్దేరిన సిక్కు యువతి రాజ్ ప్రీత్ హేర్ జాత్యహంకార వేధింపులు ఎదుర్కొంది.
తనకు ఎదురైన వేధింపుల అనుభవం గురించి 'ది న్యూయార్క్ టైమ్స్' పత్రిక ప్రచురించే 'దిస్ వీక్ ఇన్ హేట్' లో వివరించింది. ట్రైన్ లో ఆమె వద్దకు వచ్చిన శ్వేత జాతీయుడు ఆమెను మధ్యప్రాచ్యపు యువతిగా భావించి... 'నువ్వు ఈ దేశానికి చెందిన దానివి కావు.. లెబనాన్ తిరిగి వెళ్లిపో' అంటూ కేకలు వేశాడు. అంతటితో ఆగకుండా పరుష, అసభ్య పదజాలంతో దూషించాడని ఆమె తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా ఎదురైన వేధింపులు, జాతి విద్వేష వార్తలను 'దిస్ వీక్ ఇన్ హేట్' కాలమ్ లో న్యూయార్క్ టైమ్స్ ప్రచురిస్తుంది.