: నా వయసు దాచుకోవాలని నేను ప్రయత్నించను.. అందుకే వెనకాడలేదు: విక్టరీ వెంకటేష్

తెలుగు సినిమా హీరోల్లో ఎంతో ఇమేజ్ ఉన్న విక్టరీ వెంకటేష్ కొన్ని సీన్లలో తన ఇమేజ్ అంశాన్ని పక్కన బెట్టి మరీ నటిస్తారు. నటనలో హాస్యరసాన్ని అందించే క్రమంలో ఆయన స్టైలే వేరు. దేనికీ వెనకాడకుండా నటిస్తూ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తారు. ఈ అంశంపైనే ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తాను నటించిన ‘నువ్వునాకు నచ్చావ్’ సినిమాలో అలాంటి సందర్భం ఒకటి ఎదురైందని చెప్పారు. తన సినిమాలో సందర్భాన్ని బట్టి తన మీదే తాను సెటైర్ వేసుకోవడానికి తనకెటువంటి అభ్యంతరం లేదని అన్నారు.
‘నువ్వునాకు నచ్చావ్’ సినిమాలో ‘ఆల్రెడీ అరెకరం పోయింది’ అనే డైలాగ్ ఉంటుందని, ఆ డైలాగ్ విషయంలో ఆ సినిమా బృందం ముందు అభ్యంతరం తెలిపిందని, ఆ డైలాగ్‌ను తీసెయ్యమని ఎంతో మంది చెప్పారని, కానీ, తాను మాత్రం ఆ డైలాగ్ ఉండనివ్వమని చెప్పానని వెంకటేష్ అన్నారు. తన వయసు దాచుకోవాలని తాను ప్రయత్నించబోనని అన్నారు. తాను నటించే చిత్రాల్లో సందర్భానికి తగ్గట్టే ఉండాలని కోరుకుంటానని వ్యాఖ్యానించారు.