: మీ ఇంట్లో దొంగతనం చేస్తాం...కావాలంటే డాబా మీద గుర్తులు చూసుకో: విశాఖలో వాట్స్ యాప్ సందేశం


ఉత్తరాంధ్రలో గతంలో దువ్వన్న దొర అనే గజదొంగ ఎవరింటికైనా చోరీకి వెళ్లేముందు... వారికి ముందుగానే దొంగతనానికి వస్తానని చెప్పి మరీ దొంగతనం చేసేవాడంటూ కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. అతనిని స్పూర్తిగా తీసుకున్నారో ఏమో కానీ వైజాగ్ లో చిత్రమైన దొంగల వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... గోపాలపట్నం నుంచి పెందుర్తి వెళ్తున్న దారి మధ్యలో ఉన్న వేపగుంట రామాలయం వీధిలో ఏయూలో పీజీ చదువుతున్న విద్యార్థిని ఫోన్ వాట్స్ యాప్ కు ఒక మెసేజ్ వచ్చింది.

మీ ఇంటికి రాత్రికి దొంగతనానికి వస్తాం...బీ కేర్ ఫుల్...నమ్మకం కలగకపోతే...మీ ఇంటి మేడ మీదికి వెళ్లి ఈ గుర్తులు చూసుకో.. అంటూ పలు గుర్తులను పంపారు. దీంతో మేడమీదకి వెళ్లిన యువతి షాక్ తో తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో అప్రమత్తమైన వారు పక్కింటి వారికి చెప్పడంతో అది ఆనోటా ఈనోటా చేరి, కాలనీ మొత్తం పాకిపోయింది. దీంతో మరికొందరు తమ మేడపై చూడగా, మూడిళ్లపై అచ్చం అలాంటి గుర్తులే కనిపించాయి. దీంతో కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చి, రాత్రంతా నిఘా వేశారు. కాగా, ఎవరో బాగా పరిచయస్తులే ఈ విధంగా చేసి, భయపెడుతున్నారేమో అన్న అనుమానాలు కూడా స్థానికుల్లో కలుగుతున్నాయి.  

  • Loading...

More Telugu News