: కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన తెలంగాణ హోంమంత్రి నాయిని... నీ సంగతి చూస్తానంటూ హెచ్చరిక
తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి కోపమొచ్చింది. ఆ కోపంలో ఓ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. అంతటితో ఆగక 'నీ సంగతి చూస్తా'నంటూ హెచ్చరించారు. నువ్వు ఎక్కడెక్కడ పైసలు వసూలు చేస్తున్నవో తనకు తెలుసని, నీ సంగతి చెప్తానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సందర్భంగా శుక్రవారం బేగంబజార్‌లో నిర్వహించిన సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. సభలో తొలుత మాట్లాడిన హోంమంత్రి నాయిని అనంతరం నందకిషోర్ వ్యాస్ అనే కార్యకర్తకు మైక్ ఇచ్చారు. దీనికి మరో కార్యకర్త ఆర్.ఎ.మహేందర్ అభ్యంతరం తెలిపారు.
నందకిషోర్‌కు ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారని నిలదీశారు. ఉద్యమకారులను పక్కనపెట్టి కొత్తవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఆయన మాటలతో ఊగిపోయిన మంత్రి ఒక్కసారిగా మహేందర్‌పై చేయిచేసుకున్నారు. నీ సంగతి చూస్తా.. అని హెచ్చరించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మహేందర్‌కు పలువురు మద్దతుగా నిలిచి నాయినితో వాగ్వాదానికి దిగారు. గొడవ ముదరడంతో రంగంలోకి దిగిన ఇతర నేతలు ఇరు వర్గాలను సముదాయించడంతో గొడవ చల్లారింది.