: మూడు వాహనాల్లో యూపీ చేరుకున్న ఉగ్రవాదులు.. పోలీసులకు అందిన హెచ్చరిక లేఖ
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో ఉగ్రదాడులు జరగనున్నాయంటూ మీరట్ పోలీసులకు అందిన బెదిరింపు లేఖతో కలకలం రేగింది. మూడు వాహనాల్లో వచ్చిన ఉగ్రవాదులు ఇప్పటికే ఘజియాబాద్ చేరుకున్నారని, ఢిల్లీని కాపాడుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను తేలిగ్గా తీసుకుంటే లక్షలాదిమంది ప్రజలు ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన ఈ లేఖను ఓ బిచ్చగాడు పోలీసులకు అందించాడు. తన చేతిలో పది రూపాయలు పెట్టి ఓ వ్యక్తి ఈ లేఖ ఇచ్చి పోలీసులకు ఇమ్మని చెప్పాడని బిచ్చగాడు పోలీసులకు తెలిపాడు. కాగా, ఇటువంటి లేఖే మరోటి మంగళ్‌పాండే ప్రాంతంలోని ఓ కానిస్టేబుల్‌కు అందింది. ఆయన దానిని ఉన్నతాధికారులకు అందజేశాడు. లేఖలతో అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు రోజుల క్రితం వారణాసిలోనూ ఇటువంటి లేఖ ఒకటి కలకలం సృష్టించింది.