: జగన్‌ను ఏదడిగినా మూడేళ్లు అంటాడు.. ఐసీయూలో ఉన్న పేషెంట్ దగ్గరకెళ్లినా ఇదే మాటంటాడు... పూర్వ వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆ పార్టీ పూర్వ ఎమ్మెల్యే, టీడీపీలో చేరిన శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి చెణుకులు విసిరారు. జగన్‌ను ఏదడిగినా మూడేళ్లు అంటాడని, రేషన్, పెన్షన్,.. ఇలా దేని గురించి మాట్లాడినా మూడేళ్లు ఆగాలని చెప్పేవాడని గుర్తు చేసుకున్నారు. చివరికి ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్‌కు సాయం చేయాలన్నా మూడేళ్లు ఆగాలంటాడని సెటైర్ వేశారు. ఆయనకు డబ్బు మీద యావ, పదవిపై మోజు తప్ప మరేం లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పురోగతిలో వెళ్తుంటే జగన్ అధోగతిలో ఉన్నారని విమర్శించారు. వైఎస్ కుటుంబం వందలాది హత్యలు చేయించిందని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాన్ని నడపడం చేతకాకపోవడం వల్లే తాము వైసీపీ నుంచి బయటకు వచ్చామని వివరించారు. అసెంబ్లీలో జగన్ ప్రవర్తనను ఖండిస్తూ చేసిన తీర్మానంపై ఆదినారాయణరెడ్డి సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.