: దారుణంగా వ్యవహరిస్తున్నారు.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం కచ్చితంగా పెడతాం: వైఎస్ జగన్
తాను అగ్రిగోల్డ్ అంశంపై చెబుతున్నవన్నీ ఆరోపణలే అని అధికార పక్ష నేతలు అంటున్నారని, అలాంటప్పుడు ఆ ఆరోపణలు నిజమో కాదో తెలుసుకోవడానికి సీబీఐతో విచారణ జరిపిస్తే తెలిసిపోతుంది కదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. విచారణ జరిపించి నిజాన్ని తేల్చితే తన ఆరోపణలో న్యాయం ఉందా? లేదా? అన్నది ప్రజలకు తెలుస్తుందని చెప్పారు. తన దగ్గరున్న ఆధారాలు సరిపోవని చెబుతూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. స్పీకర్ అనే వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఉండాలని, అంతేకానీ ఏకపక్షంగా వ్యవహరించడం ఏంటని జగన్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాల్వ శ్రీనివాసులు సైగలు చేయడం.. స్పీకర్ కోడెల సభను వాయిదా వేయడం అందరం టీవీల్లో చూశామని అన్నారు. చంద్రబాబు సభను వాయిదా వేయమంటారని, కాల్వ శ్రీనివాసులు చేయి ఊపుతారని, ఇక స్పీకర్ సభను వాయిదా వేస్తారని జగన్ ఎద్దేవా చేశారు. తాము స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం కచ్చితంగా పెడతామని చెప్పారు. స్పీకర్ ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారనేది ప్రజలందరికీ తెలియాలని అన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే ఏం జరుగుతుందో అవన్నీ తనకు తెలుసని, అయినా కూడా పెడతామని ఉద్ఘాటించారు. ప్రజలకు ఈ అప్రజాస్వామ్యం గురించి తెలియాలని అన్నారు. స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తిగా ఉండాలని చెప్పారు. ఈ రోజు రెండు గంటలసేపు సభను కేవలం తనను తిట్టడానికే వాడారని జగన్ అన్నారు.