: జగన్ ప్రవర్తనను ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ శాసనసభ ఆమోదం.. రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరును నిరసిస్తూ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ అంశంపై మాట్లాడుతూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై వైసీపీ నేతలు పలు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభలో జగన్ ప్రవర్తనను ఖండిస్తూ మంత్రి యనమల ఈ తీర్మానాన్ని పెట్టగా దానిపై మాట్లాడిన టీడీపీ, బీజేపీ సభ్యులు జగన్ తీరును విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాల సమయాన్ని వృథా చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకుడి హోదాలో హుందాగా వ్యవహరించడం లేదని అన్నారు. సభ్యులంతా ఆయన ప్రవర్తనను తీవ్రంగా ఖండించడంతో ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పేర్కొన్నారు. కాగా, అంతకుముందే వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం శాసనసభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.