: తైవాన్‌కు ఆయుధాలు విక్రయించడాన్ని ఆపండి!: అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికాకు డ్రాగన్ కంట్రీ చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చైనాకు వ్యతిరేకంగా వాణిజ్యపరమైన ఆంక్షలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలో అమెరికా అధ్యక్షుడు పేర్కొన్న వేళ.. అమెరికా తీసుకునే నిర్ణయాలను బట్టి తమ నిర్ణయాలు ఉంటాయని చైనా హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అమెరికాపై చైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తైవాన్ కు అత్యాధునిక ఆయుధాలు విక్రయించాలన్న అమెరికా నిర్ణయాన్ని చైనా తప్పు పట్టింది.
ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా యున్ యింగ్ మాట్లాడుతూ, ‘‘తైవాన్‌కు అమెరికా ఆయుధాలు విక్రయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని అన్నారు. అత్యంత సున్నితమైన, ప్రమాదకరమైన ఈ విషయాన్ని అమెరికా అర్థం చేసుకుంటుందని భావిస్తున్నామని ఆమె తెలిపారు. చైనో-యూఎస్ సంబంధాలు దెబ్బతినకుండా ఉండాలని భావించినా, లేదా తైవాన్ లో శాంతి, సుస్థిరత విలసిల్లాలన్నా అమెరికా ‘వన్ చైనా' విధానానికి కట్టుబడి ఉండాలని ఆమె సూచించారు. తైవాన్ కు ఆయుధాల విక్రయాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.