: చివరికి భార్యాభర్తల పంచాయతీని కూడా తాను సీఎం అయ్యాకే పరిష్కరిస్తానని జగన్ అంటారు!: ఆది నారాయణరెడ్డి సెటైర్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై టీడీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకుడు ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సాక్షి పత్రికను అడ్డుపెట్టుకొని జగన్ ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేస్తుంటారని అన్నారు. వైసీపీలో జగన్ ప్రవర్తన నచ్చకే 21 మంది టీడీపీలోకి వచ్చేశారని అన్నారు. జగన్‌కు ఆశ మరీ ఎక్కువగా ఉందని చెప్పారు. ఆయన వద్దకు వచ్చి ఎవరైనా ఏదైనా కావాలని అడిగితే, తాను సీఎం అయ్యాకే చేస్తానని చెబుతారని విమర్శించారు. చివరికి భార్యాభర్తల పంచాయతీ అయినా సీఎం అయ్యాకే పరిష్కరిస్తా అంటారని ఆదినారాయణ రెడ్డి చమత్కరించారు. డబ్బు, పదవి అంటే జగన్‌కి ఎంతో వ్యామోహమని చెప్పారు.