: మైకు ఇవ్వ‌క‌పోతే ప్రెస్ ముందుకు వెళ్లి అక్కడ రుజువు చేస్తా!: వైఎస్ జ‌గ‌న్


వాయిదా అనంత‌రం ప్రారంభమైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌లో మ‌ళ్లీ గంద‌ర‌గోళం చెల‌రేగింది. ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు వెల్‌లోకి వెళ్లి త‌మ‌కు స‌మ‌యం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ స‌భ్యుల‌పై స్పీక‌ర్ కోడెల శివప్ర‌సాద్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ మాత్రమే మాట్లాడితే కూర్చుంటాం.. లేదంటే నినాదాలు చేస్తామంటే కుద‌ర‌ద‌ని అన్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ... కొన్ని ప‌త్రాలు చూపుతూ 20 నిమిషాల స‌మ‌యం ఇస్తే ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని నిరూపిస్తాన‌ని అన్నారు. తనకు మైకు ఇవ్వకపోతే ఈ విష‌యాన్ని మీడియా స‌మావేశంలో చెప్పి రుజువు చేస్తానని అన్నారు.

అయితే, అందుకు స్పీక‌ర్ ఒప్పుకోలేదు. దీంతో మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మాట్లాడుతూ.. న్యాయ విచార‌ణ‌కు డిమాండ్ చేస్తే ఒప్పుకోకుండా జ‌గ‌న్ వెన‌క్కి వెళుతున్నారని, ఇప్పుడేమో ఏవో కాగితాలు ప‌ట్టుకొచ్చి నిరూపిస్తానంటున్నార‌ని అన్నారు. జ‌గ‌న్ నిరూపించాలంటే ఆ విష‌యాల‌న్నింటినీ న్యాయ విచార‌ణ జ‌రిగితే అక్క‌డ చెప్పాల‌ని అన్నారు. ఆ రుజువులేవో అక్క‌డే చూపించాల‌ని అన్నారు. అక్క‌డ కాకుండా ఇక్క‌డ చూపిస్తానంటున్నాడంటే ఆ పేప‌ర్ల‌న్నీ బోగ‌స్‌గా అర్థ‌మ‌వుతుందని వ్యాఖ్యానించారు. అస‌లు స‌భ స‌మ‌యం వృథా చేసే వారి నుంచి ఫైన్ గా డ‌బ్బు వ‌సూలు చేయాలని అన్నారు. ఇలాగే జ‌రిగితే ఇక శాస‌న‌స‌భ ముందుకు వెళ్ల‌దని అన్నారు.

  • Loading...

More Telugu News