: సమయం లేదు జగన్ గారు... శరణమా? సమరమా?: జగన్ కు టీడీపీ సూటిప్రశ్న
అగ్రీగోల్డ్ ఆస్తులను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేశారన్న జగన్ ఆరోపణలపై, సవాళ్లు, ప్రతి సవాళ్లు అసెంబ్లీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్న వేళ, మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, సభా సమయం ఇప్పటికే చాలా వృథా అయిందని, విచారణ జరిపించి నిజాన్ని వెలికితీస్తే, తప్పు ఎవరిదైతే వారు రాజీనామా చేయాలన్న సవాల్ ను జగన్ అంగీకరించాలని డిమాండ్ చేశారు.
"నేను చాలా సూటిగా ప్రతిపక్ష నాయకుడిని అడుగుతున్నాను. సమయం లేదు జగన్ గారూ... మీరు శరణమా? సమరమా? ఏదో ఒకటి చెప్పండి. మీరు ఈ సభకు క్షమాపణ చెబుతారా? ఎంక్వైరీకి ఒప్పుకుంటారా? ఏదో ఒకటి చెప్పండి. మేం అడుగుతున్నాం. రెండు నిమిషాల్లో తేలాలి. పుల్లారావుకు క్షమాపణలు చెప్పినా సరే.. లేకుంటే విచారణకు ఒప్పుకున్నా సరే. ఈ రెండు పాయింట్లకూ ఇంత సమయం వృథా చేయడం భావ్యం కాదు. జగన్ శరణానికైనా ఒప్పుకోవాలి. సమరానికైనా ఒప్పుకోవాలి" అని అన్నారు.