: నీటి కుళాయిల వద్ద విసురుకునే సవాళ్లలా ఉన్నాయి: జగన్
టీడీపీ నేతలు విసురుతున్న సవాళ్లకు అర్థం లేదని... నీటి కుళాయిల వద్ద విసురుకునే సవాళ్లలా వీరి సవాళ్లు ఉన్నాయని వైసీపీ అధినేత జగన్ ఎద్దేవా చేశారు. ఇదే సభలో గతంలో తాను విసిరిన సవాల్ కు ప్రభుత్వం పారిపోయిందని అన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో నిజాలు వెలుగు చూడకూడదనే కారణంగానే... సభలో తమ గొంతు నొక్కే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా పడిన సమయంలో, మీడియా ప్రతినిధులతో జగన్ చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను సభ ముందు ఉంచే ప్రయత్నాలను తాము చేస్తుంటే... తమ ప్రయత్నాన్ని అధికారపక్షం అడ్డుకుంటోందని ఆరోపించారు. తాము ఆధారాలను ప్రవేశపెట్టాక... టీడీపీ సభ్యులు తమ వాదనను వినిపించవచ్చని... ఆ తర్వాత తప్పు ఎవరు చేశారన్న విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.
నిజాలు బయటపడితే, పుల్లరావు సహా పలువురు అధికారపక్ష నేతల బండారం బయటపడుతుందని... అందుకే తాను మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే, మైక్ కట్ చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. సభ విలువలను, గౌరవాన్ని స్పీకర్ దిగజార్చుతున్నారని విమర్శించారు.