: కూర్చుంటే లెయ్యలేనోళ్లు, లేస్తే కూర్చోలేనోళ్లూ చాలెంజ్ లు చేస్తున్నారు: చెవిరెడ్డి ఎద్దేవా
ఏపీ అసెంబ్లీలో కూర్చుంటే లెయ్యలేనోళ్లు, లేస్తే కూర్చోలేనోళ్లూ చాలెంజ్ లు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఉదయం అసెంబ్లీ బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ, "ఎంత బాధాకరం అంటే, ఒకడు తొడగొడతాడు. ఇంకొకడు మీసం తిప్పుతాడు. సవాల్ అంటాడు. రాజీనామాకు సిద్ధమా? అంటాడు. అరె నీయమ్మ బడవా.... కనీసం డిస్కస్ చెయ్యాలా? వద్దా? మేము చాలెంజ్ ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. చాలెంజ్ ని స్వీకరించే ముందు, రెండు మూడు నిమిషాలు ఏం జరిగిందన్నది చెప్పి చాలెంజ్ ని స్వీకరిస్తాం. కూర్చుంటే లెయ్యలేనోళ్లు, లేస్తే కూర్చోలేని ముసలోళ్లు కూడా చాలెంజ్ చేస్తున్నారు.
బాగానే వుంది. మా నాయకుడు చాలెంజ్ స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. వాస్తవాలు, ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. అన్నింటికీ సిద్ధంగా ఉన్నప్పుడు, మా నాయకుడికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? ఒక్క నిమిషం మాట్లాడేందుకు అవకాశం ఇచ్చుంటే, చాలెంజ్ స్వీకరించే వాళ్లం. మైక్ ఇవ్వడం లేదంటే, ఎక్కడ మా నాయకుడు చాలెంజ్ ని స్వీకరిస్తారోనన్న భయం. నిజాలు బయటకు వస్తాయన్న భయం. నేను చాలెంజ్ చేస్తున్నా, ప్రత్తిపాటి పుల్లారావుకు. మా నాయకుడి దాకా ఎందుకు? నేను ఇప్పుడే నా రాజీనామా లేఖను స్పీకర్ కు ఇస్తా. నువ్వూ రాజీనామా లేఖ రాయి. ఇద్దరమూ రాజీనామా లేఖలు ఇద్దామా?" అని చెవిరెడ్డి సవాల్ విసిరారు.