: సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా, కావేరీ నీటిని ఇచ్చే సమస్యే లేదు: కుండబద్దలు కొట్టిన కర్ణాటక
తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా, నదిలో ఉన్న నీరు తమ ప్రజల తాగు నీటి అవసరాలకు కూడా సరిపోని కారణంగా, కిందకు నీటిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కర్ణాటక కుండబద్దలు కొట్టింది. 2007 నాటి కావేరీ జల వివాదాల ట్రైబ్యునల్ తీర్పు మేరకు రోజుకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, కోర్టు ఆదేశాలను పాటించే పరిస్థితి లేదని రాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ వెల్లడించారు. రోజుకు 2 వేల క్యూసెక్కుల నీటిని ఎక్కడి నుంచి తేవాలని ఆయన ప్రశ్నించారు. బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల ప్రజల దాహార్తిని తీర్చాలన్నా తమకు నాలుగు టీఎంసీల తక్కువ నీరు ఉందని ఆయన వెల్లడించారు. తమ వద్దే నీరు లేకుంటే, ఎక్కడ నుంచి విడుదల చేస్తామని పాటిల్ ప్రశ్నించారు. కాగా, ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల కారణంగా తమిళనాడు రిజర్వాయర్లలో 80 శాతం ఖాళీగా ఉన్నాయి.