: వీవ్ రిచర్డ్స్ ఆ రోజు ఫోన్ చేయకుంటే అప్పుడే బై చెప్పేసేవాడిని!: సచిన్ టెండూల్కర్
తన కెరీర్ లోనే అత్యంత దుర్దినాన్ని ఎదుర్కొన్న వేళ, క్రికెట్ దిగ్గజం, తన అభిమాన ఆటగాడు వీవ్ రిచర్డ్స్ ఫోన్ చేయకుంటే, అప్పుడే తాను ఆటకు విరమణ చెప్పి ఉండేవాడినని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించారు. 2007లో కరేబియన్ దీవుల్లో ప్రపంచకప్ జరిగిన వేళ, మార్చి 23, తన కెరీర్ లోనే చెడ్డ రోజుల్లో ఒకటని, గ్రూప్ దశలో బంగ్లాదేశ్, శ్రీలంక చేతుల్లో ఓడిపోయి గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని, దీంతో రెండు రోజులు తాను గదిలోంచి బయటకు రాకుండా బాధపడ్డానని సచిన్ గుర్తు చేసుకున్నాడు.
తాము అతి విశ్వాసంతో ఏమీ లేమని, బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిపోతామని అసలు అనుకోలేదని చెప్పాడు. ఆ సమయంలో తాను రిటైర్ మెంటు గురించి ప్రకటించాలని భావిస్తుంటే, ఆ విషయాన్ని తెలుసుకున్న వీవ్, ఫోన్ చేశారని, దాదాపు 45 నిమిషాలు మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడే ఎలాంటి నిర్ణయమూ తీసుకోవద్దని, వేదన నుంచి బయటపడేందుకు కొంత సమయం పడుతుందని వీవ్ చెప్పిన స్ఫూర్తిదాయక మాటలు తనపై ఎంతో ప్రభావం చూపాయని సచిన్ తెలిపారు. తిరిగి ప్రపంచకప్ ను సాధించాలన్న పనిలో నిమగ్నమయ్యానని, తీవ్ర సాధన ప్రారంభించానని అన్నారు.