: పెళ్లయిన మూడు రోజులకే భర్త హత్య.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య!


హైదరాబాద్ మల్లేపల్లిలో దారుణం జరిగింది. పెళ్లయిన మూడు రోజులకే భర్త హత్యకు గురి కాగా, భార్య ఆత్మహత్య చేసుకుంది. మూడో పెళ్లి చేసుకున్నాడని మల్లేపల్లికి చెందిన డాక్టర్ సయ్యద్ మిరాజుద్దీన్ (45)ను అతని బావమరిది నాలుగు రోజుల క్రితం హత్య చేశాడు. ఈ బాధతో అతని భార్య ఆర్షియా బేగం (30) నిన్నఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు .. మల్లేపల్లికి చెందిన డాక్టర్ సయ్యద్ మిరాజుద్దీన్ ను కాలాపత్తర్ మిస్రీ గంజ్ పూల్ బాగ్ కు చెందిన ఆర్షియా బేగం ఈ నెల 18న వివాహం చేసుకుంది. సయ్యద్ కు ఇది మూడో వివాహం.

అయితే, రెండో భార్య సోదరుడు అజీముద్దీన్ తన అక్కకు అన్యాయం జరిగిందని భావించాడు. దీంతో, బావ సయ్యద్ పై కక్ష పెంచుకున్న అజీముద్దీన్ ఈ నెల 21న మల్లేపల్లిలోని సయ్యద్ క్లినిక్ లోనే అతని గొంతు కోసి హతమార్చాడు. ఈ ఆవేదన తట్టుకోలేకపోయిన ఆర్షియా, నిన్న ఉదయం నమాజ్ చేసుకున్న అనంతరం తన గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ‘నా భర్త నన్ను ఎంతగానో ప్రేమించేవాడు. ఆయన లేని జీవితం నాకు అక్కర్లేదు. నా భర్త మృతదేహాన్ని ఖననం చేసిన చోటే నన్నూ ఖననం చేయండి’ అంటూ లేఖ రాసి పెట్టిన ఆర్షియా బేగం ఉరి వేసుకుని చనిపోయిందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News