: వ్యాపారి పర్సు మాయం... సినీ నిర్మాత చిల్లర కళ్యాణ్ కుమారుడిపై కేసు నమోదు!
ప్రముఖ సినీ నిర్మాత చిల్లర కళ్యాణ్ కుమారుడు వరుణ్ కుమార్ పై చోరీ కేసు నమోదైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్, బంజారాహిల్స్ లోని రోడ్ నంబరు 12లో ఎమ్మెల్యే కాలనీలో ట్రాన్స్ పోర్ట్ వ్యాపారి బి. శ్రీనివాస్ నివసిస్తుంటారు. నిన్న సాయంత్రం తన కుమారుడితో కలిసి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ కు ఆయన వచ్చారు. శ్రీనివాస్ తన దుస్తులతో పాటు పర్సును పక్కన పెట్టి స్విమ్మింగ్ కు దిగారు.
అనంతరం వచ్చి చూస్తే ఆయన పర్సు మాయమైంది. డెబిట్, క్రెడిట్ కార్డులు సహా ముఖ్యమైన ధ్రువపత్రాలు అందులో ఉన్నాయి. అయితే, పర్సు చోరీ అయిన గంట సేపటిలోనే తన యాక్సిస్ బ్యాంకు కార్డు నుంచి రూ.1.82 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డు నుంచి రూ.27,600 లు వేరే ఖాతాకు బదిలీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సదరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ నిర్మాత చిల్లర కల్యాణ్ కుమారుడు వరుణ్ కుమార్ ఖాతాలోకి ఈ మొత్తం బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ పర్సును వరుణ్ కుమార్ చోరీ చేసినట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు.