: ‘కాటమరాయుడు’లో పవన్ చాలా చలాకీగా కనిపించాడట!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం సందడి తెలుగు రాష్ట్రాలలో ఈ ఉదయం నుంచే మొదలైంది. అయితే, కువైట్, మస్కట్ దేశాల్లో ఈ సినిమా ఇప్పటికే విడుదలైంది. అక్కడి ప్రేక్షకుల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో పవన్ చాలా హుషారుగా కనిపించాడని సమాచారం. సినిమా అంతటా పంచెకట్టుతో కనిపించే పవన్ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దారని, శ్రుతి హాసన్ తో లవ్ ట్రాక్ బాగా పండిందని కువైట్ ప్రేక్షకులు చెబుతున్నారు. డ్యాన్స్ పై మరింతగా పవన్ దృష్టి పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డ ప్రేక్షకులు, ‘కాటమరాయుడు’ క్లైమాక్స్ రసవత్తరంగా ఉందని అంటున్నారు. కాగా, ఈ చిత్రంలో పవన్ వన్ మ్యాన్ షో చేశారని పవర్ స్టార్ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా చెబుతున్నారు.