: యూపీలో ఉపాధ్యాయులు జీన్సు, టీ షర్టులు ధరించకుండా, మొబైల్ వాడకుండా చర్యలు!
ఉపాధ్యాయ వృత్తిపై గౌరవం పెంచేలా టీచర్లకు పలు సూచనలు చేస్తానని, అందుకోసం సంబంధిత అధికారులతో మాట్లాడతానని లక్నో డిస్ట్రిక్ట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్(డీఐవోఎస్) ఉమేశ్ త్రిపాఠి చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఇకపై జీన్సు, టీషర్టులు ధరించి పాఠశాలలకు రాకుండా చూస్తామని చెప్పారు. వారి వస్త్రధారణ తాము చేస్తోన్న వృత్తిపై గౌరవం పెంచేలా ఉండాలని ఆయన చెప్పారు. అదే విధంగా ఉపాధ్యాయులు పనివేళల్లో మొబైల్ ఫోన్లను వాడడం కూడా మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అలాగే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా ఉదయం పూట ప్రార్థనలు జరిగేలా చూస్తామని తెలిపారు. అలాగే పాఠశాలలకు సమీపంలో ఉండే పాన్ షాపులను వెంటనే మూసేయాలని ఆదేశాలు ఇస్తామని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే.