: అప్పుడు, నాగబాబుకు ఫోన్ చేసి పవన్ కల్యాణ్ తిట్టమన్నారు!: నటుడు సమీర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పాలైన సందర్భంలో తాను చేసిన వ్యాఖ్యల పర్యవసానం గురించి ఓ ఇంటర్వ్యూలో క్యారెక్టర్ ఆర్టిస్టు సమీర్ ప్రస్తావించాడు. ఆ సినిమా పరాజయం పాలవడంతో పవన్ అభిమానిని అయిన తాను చాలా నిరాశ చెందానని, ఆ సినిమా గురించి తన ఫేస్ బుక్ ఖాతాలో రాశానని చెప్పాడు. ఆ మర్నాడు ఉదయాన్నే నాగబాబు ఫోన్ చేసి తనకు చీవాట్లు పెట్టడంతో, ఆ పోస్ట్ ను తొలగించానని అన్నాడు. ఆ తర్వాత పనన్ కల్యాణ్ ఫోన్ చేసి ‘నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. నాగబాబు తిట్టడం తప్పు. నువ్వు, ఇప్పుడు నాగబాబుకు ఫోన్ చేసి తిట్టు’ అని ఫోన్ లో పవన్ అన్నట్టు సమీర్ చెప్పాడు.
అయితే, తాను మాత్రం సైలెంట్ గా ఉండిపోయానని, ఫోన్ చేయలేదని చెప్పాడు. కట్ చేస్తే.. నాలుగేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో విడుదలైన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ఓ పాత్రలో నటించాలని ఫోన్ వస్తే తాను వెళ్లానని, అక్కడే ఉన్న పవన్ కల్యాణ్ తనను పలుకరించి, తన గదిలోకి రమ్మనడంతో వెళ్లానని చెప్పాడు. ‘ఇక్కడున్నావు ఏంటీ?’ అని పవన్ ప్రశ్నించడంతో, ‘ఈ సినిమాలో నేను చేస్తున్నాను సార్’ అని బదులిచ్చానని సమీర్ చెప్పాడు. "పవన్ వెంటనే త్రివిక్రమ్ గారిని పిలిపించమని చెప్పడంతో, ఆయన అక్కడికి వచ్చారు. గతంలో నేను చేసిన ఫేస్ బుక్ పోస్ట్ గురించి త్రివిక్రమ్ కు చెప్పిన పవన్, ‘ఈ సినిమాలో మీకు నేను కావాలా, సమీర్ కావాలా?’ అనడంతో.. తనకు సమీరే కావాలని త్రివిక్రమ్ చెప్పారు. దీంతో, పెద్దగా నవ్విన పవన్, త్రివిక్రమ్ ను కౌగిలించుకోవడంతో.. వాళ్లిద్దరూ సరదాగా నన్ను ఆడుకుంటున్నారనే విషయం నాకు అర్థమైంది" అంటూ సమీర్ చెప్పుకొచ్చాడు.