: మేము అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకి పరిహారం ఇచ్చేస్తాం: జ‌గ‌న్


విజ‌య‌వాడ‌లో అగ్రిగోల్డ్ బాధితులు చేస్తోన్న‌ నిరాహార దీక్షల శిబిరం వద్దకు ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లయిపోయిందని, కళ్లు మూసుకుంటే మరో రెండేళ్లు గడుస్తాయని, ఆ తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వమ‌ని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వ‌చ్చిన పది రోజుల్లోనే 14 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల‌కి 1,182 కోట్ల రూపాయ‌ల‌ను అందేలా చూస్తాన‌ని అన్నారు. అగ్రిగోల్డ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న 105 కుటుంబాల వారికి ఇచ్చే పరిహారాన్ని 10 లక్షల రూపాయ‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు.
 
ఈ రోజు అగ్రిగోల్డ్ మీద అసెంబ్లీలో తాము చర్చకు పట్టుబట్టామ‌ని జ‌గ‌న్ చెప్పారు. దీంతో అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు  స్టేట్‌మెంట్ చదివేశార‌ని, తర్వాత ఆ అంశంపై చ‌ర్చ‌కు 20 నిమిషాలు స‌మ‌యం ఇవ్వడమే గొప్ప అన్నట్లు ఆయ‌న మాట్లాడార‌ని అన్నారు. తాము అగ్రిగోల్డ్ బాధితుల బాధ‌లు చెప్పాల‌నుకుంటే వినడానికి ప్ర‌భుత్వానికి ఓపిక లేకుండా పోయిందని అన్నారు. మంత్రిగా ఉన్న తర్వాత‌ ఆస్తులు అటాచ్‌మెంట్ అవుతున్న విషయం తెలిసే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన భార్యతో తక్కువ రేటుకు కొనిపించారని అగ్రిగోల్డ్ బాధితులు చూపించిన డేటాను తాను అసెంబ్లీలో చూపించానని చెప్పారు.

అగ్రిగోల్డ్ అంశంపై మాట్లాడుతుంటేనే మైక్ కట్ చేశారని జగన్ అన్నారు. ఇటీవ‌లి ప్రెస్ మీట్‌లో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు కార్లు షెడ్డులోనే ఉండాలని, ఆడవాళ్లు వంటింటికే పరిమితం కావాలని అన్నార‌ని, అప్పుడే వాళ్ల మీద అత్యాచారాలు తగ్గుతాయని చెప్పారని జ‌గ‌న్ అన్నారు. ఆ మాటలను జాతీయ మీడియాలోని పెద్దపెద్ద పేపర్లు, టీవీ చానళ్లు కూడా చూపించాయని అన్నారు. అయితే, ఆ వీడియో క్లిప్పింగ్‌ను ఈ రోజు చూపిస్తూ అగ్రిగోల్డ్ అంశాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News