: టెన్నీస్ కోర్టులో రసవత్తర పోరు.. ఇంతలో ఉడుము ప్రవేశంతో ఆగిపోయిన మ్యాచ్!
స్కోరు బోర్డుపైకి అకస్మాత్తుగా ఉడుము వచ్చిన ఘటన ఫ్లోరిడాలో జరుగుతోన్న మియామి ఓపెన్‌లో ఈ రోజు చోటుచేసుకుంది. ఉన్నట్టుండి ఓ ఉడుము దర్శనమివ్వడంతో ఆసక్తికరంగా కొనసాగుతున్న ఆ మ్యాచు కొద్దిసేపు వాయిదా పడింది. పురుషుల సింగిల్స్‌లో భాగంగా టామీ హాస్(జర్మనీ)తో వెస్లి(చెక్) పోటీ పడుతూ ఇద్దరూ చెరో సెట్ గెలిచి మూడో సెట్‌లో పోరాడుతున్నారు. అయితే, స్కోరు బోర్డుపైకి ఒక్కసారిగా ఉడుము రావడంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. దీంతో అక్కడి అభిమానులు తమ స్మార్ట్‌ఫోన్లు, కెమెరాలతో ఆ ఉడుముతో సెల్ఫీలు, ఫొటోలను తీసుకున్నారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే, ఉడుము అక్కడి నుంచి వెంటనే వెళ్లకపోవడంతో కోర్టు సిబ్బంది దాన్ని పంపించేందుకు యత్నించారు. ఈ క్రమంలో అది టెన్నిస్ కోర్టులోకి ప్రవేశించి అక్కడే అటూ ఇటూ తిరిగి హల్‌చల్ చేసింది. అనంతరం ఎలాగోలా దాన్ని పట్టుకున్న సిబ్బంది దాన్ని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. తర్వాత మ్యాచ్ కొనసాగింది. చివరి సెట్‌ను కైవసం చేసుకున్న వెస్లీ 6-7, 6-3, 7-5తో మ్యాచ్‌లో విజేతగా నిలిచాడు.
Best of Iggy, the iguana @MiamiOpen. pic.twitter.com/ORMtZFX5fv
— Aliny Calejon (@alcalejon) 22 March 2017