: స్పీకర్ మీద ఇక నమ్మకం పోయింది... అవిశ్వాస తీర్మానం పెడతాం: మీడియాతో జగన్
ఇటీవల జరిగిన మహిళా పార్లమెంటేరియన్ సదస్సు సందర్భంగా నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ వీడియోను ఈ రోజు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చూపించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా తమ సభ్యులతో బయటకు వచ్చేసిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ స్పీకర్ మీద తమకు నమ్మకం, గౌరవం పోయాయని, తాము ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని అన్నారు.
నిన్న ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించిన నేపథ్యంలో తన వెనక నిల్చుని ఉన్న చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుకు సైగలు చేస్తూ ప్రతిజ్ఞ చేయించడం పూర్తి కాగానే సభను వాయిదా వేయించమని చెప్పారని జగన్ ఆరోపించారు. అనంతరం కాల్వ శ్రీనివాసులు తల ఊపుతూ, చేయి ఊపుతూ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు సైగ చేశారని ఆయన అన్నారు. దీంతో నిన్న ఆ ప్రతిజ్ఞ పూర్తి కాగానే తాను మాట్లాడకుండా స్పీకర్ సభను ఈ రోజుకి వాయిదా వేశారని ఆయన ఆరోపించారు.
మరోవైపు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అగ్రిగోల్డ్ మీద చర్చ మొదలైతే ఆ చర్చకు సంబంధం లేని విషయంలోకి తీసుకెళ్లారని జగన్ అన్నారు. అగ్రిగోల్డ్ అంశాన్ని పట్టించుకోకుండా సాక్షి మీడియా అంటూ చర్చ మొదలుపెట్టారని జగన్ వ్యాఖ్యానించారు.