: అసెంబ్లీ లోపలి దృశ్యాలను దొంగిలించినప్పుడు ఆయన ప్రతిష్ఠకు భంగం కలగలేదా?: రోజా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ అంశాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. అయితే, ఆ అంశంపై సభను పక్కదోవ పట్టించేందుకే ప్రభుత్వ పక్ష సభ్యులు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు ఆమె అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ... తాము అగ్రిగోల్డ్ అంశాన్ని లేవనెత్తిన తర్వాతే సర్కారు దానిపై సభలో ప్రకటన చేసిందని రోజా చెప్పారు. సభలో స్పీకర్ ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని టీడీపీ సభ్యులు అంటున్నారని, అయితే, స్పీకర్‌కు తెలియకుండానే అసెంబ్లీ లోపలి దృశ్యాలను దొంగిలించినప్పుడు ఆయన ప్రతిష్ఠకు భంగం కలగలేదా? అని ప్రశ్నించారు.
ఇటీవల నిర్వహించిన మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా స్పీకర్ నిర్వహించిన ప్రెస్ మీట్ వీడియోను స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఈ రోజు అసెంబ్లీలో చూపి సాక్షి మీడియా తన మాటలను వక్రీకరించిందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ కోడెల మహిళలపై చేసిన వ్యాఖ్యలను జాతీయ మీడియాతో పాటు మిగతా అన్ని ఛానల్స్ ప్రసారం చేశాయని, మరి ఆ ఛానళ్ల గురించి ఎందుకు ప్రస్తావించలేదని రోజా ప్రశ్నించారు. మిగతా ఛానళ్ల వీడియో క్లిప్పింగ్ లను కూడా శాసనసభలో ప్రదర్శించాలని ఆమె అన్నారు.