: కోటీశ్వరుల క్లబ్ లో సునాయాసంగా చేరిపోతున్న పేటీఎం ఉద్యోగులు!
దిగ్గజ చైనా సంస్థ అలీబాబా అండదండగా, నోట్ల రద్దు తరువాత శరవేగంగా వ్యాపారాన్ని విస్తరించుకున్న చెల్లింపు మాధ్యమ సంస్థ పేటీఎంలో ఉద్యోగులు ఒక్కొక్కరుగా కోటీశ్వరులుగా మారుతున్నారు. పేటీఎం యాజమాన్య సంస్థగా ఉన్న వన్ 97 కమ్యూనికేషన్స్ లో వాటాలను గతంలో ఉద్యోగులకు పంచగా, ఆ వాటాల విలువ ఇప్పుడు భారీగా పెరిగింది. దీంతో ఇటీవలి కాలంలో 47 మంది ఉద్యోగులు తమ వద్ద ఉన్న సుమారు రూ. 100 కోట్ల విలువైన వాటాలను విక్రయించారు. ఈ వాటాలను ఎవరికి అమ్మారన్న విషయాన్ని వెల్లడించేందుకు సంస్థ ప్రతినిధులు నిరాకరించారు.
సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులతో పాటు కొందరు బయటి వ్యక్తులు సైతం ఈ వాటాలను కొన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం పేటీఎంలో 500 మందికి పైగా ఉద్యోగులు ఉండగా, వారి వద్ద 4 శాతం వాటాలు ఉన్నాయి. చైనా సంస్థ అలీబాబా 250 మిలియన్ డాలర్లను పేటీఎంలో పెట్టుబడిగా పెట్టిన తరువాత, కంపెనీ విలువ 52 రెట్ల వరకూ పెరిగిన నేపథ్యంలోనే, తమ వద్ద ఉన్న వాటాలను ఉద్యోగులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.