: నేను చెప్పకుండా అన్నం తింటారా? అంటూ బూటుతో కొట్టాడు!: కపిల్ శర్మ వివాదంపై ప్రత్యక్షసాక్షి కథనం
హిందీ బుల్లితెర స్టార్ కమెడియన్ కపిల్ శర్మ మూడు రోజు క్రితం తన జీవితంలో సగభాగాన్ని పరిచయం చేస్తానంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా కపిల్ శర్మ ఇలా ట్వీట్ చేయడం వెనుక అసలు కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతకు ముందురోజు విమానంలో తాను చేసిన నిర్వాకం గురించి మీడియా ప్రశ్నించకుండా, అభిమానులను తనవైపు తిప్పుకునేందుకు అంత అకస్మాత్తుగా ప్రియురాలి ప్రస్తావనను సోషల్ మీడియాలో తెచ్చాడు. అందుకే జిన్నీని వివాహం చేసుకుంటున్నానంటూ తెలిపాడని తెలుస్తోంది. అంతకు ముందురోజు సహచరులతో కపిల్ శర్మ అభ్యంతరకరంగా వ్యవహరించాడన్న పుకార్లు షికారు చేశాయి, కానీ ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు...ఈ నేపథ్యంలో ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి ఒకరు జరిగిన ఘటనను వివరించారు.
ఆయన చెప్పిన వివరాల్లోకి వెళ్తే... ఆస్ట్రేలియాలో షో ముగించుకొని ఎయిరిండియా విమానంలో కపిల్ శర్మ బృందం ('ద కపిల్ శర్మ షో'లో పాల్గొనే నటీనటులు, సహాయక సిబ్బంది) తిరుగుప్రయాణమయ్యారు. ఈ ప్రయాణం పూర్తయ్యేందుకు 12 గంటల సమయం పడుతుంది. దీంతో విమానంలో కపిల్ శర్మ గ్లెన్ ఫిడ్డిక్ విస్కీ ఫుల్ బాటిల్ ను తాగేశాడు. కపిల్ శర్మ బాటిల్ తాగుతుండడంతో అతని బృంద సభ్యులు, విమాన సిబ్బంది తెచ్చిన ఆహారాన్ని తినేందుకు ఉద్యుక్తులయ్యారు. వారంతా తినడం ప్రారంభించడాన్ని చూసిన కపిల్ ఆగ్రహంతో ఊగిపోయాడు.
'నేను చెప్పకుండానే మీరు అన్నం తినడం ఎలా మొదలుపెట్టారు?' అంటూ వారిమీద అరిచేశాడు. కపిల్ ఆవేశంతో ఊగిపోతుండడంతో అతనిని శాంతింపజేసేందుకు సునీల్ గ్రోవర్ ప్రయత్నించాడు. దీంతో నాకే ఎదురు చెబుతావా? అంటూ సునీల్ గ్రోవర్ పై బూటు విసిరాడు. అతని కాలర్ పట్టుకుని చెంపలు వాయించాడు. దీంతో కపిల్ ను ఆపేందుకు మరో మహిళ ప్రయత్నించింది. ఆమెకు కూడా అదే అనుభవం ఎదురైంది. దీంతో విమాన సిబ్బంది కల్పించుకుని కపిల్ ను ఆపాల్సిందిగా సూచించారు. అయితే కపిల్ పరిస్థితిని చూసిన వారు ఏమీ చేయలేమని చేతులెత్తేశారు.
దీంతో మరింత రెచ్చిపోయిన కపిల్ వారిపై బూతుపురాణం అందుకున్నాడు. నోటికొచ్చినట్టు తిట్టేశాడు. ఇంత జరిగినప్పటికీ సునీల్ గ్రోవర్ మాత్రం ఎదురు తిరగలేదు. కపిల్ శర్మపై తిరగబడలేదు. దీంతో అంతా సునీల్ గ్రోవర్ కు మద్దతుగా నిలిచారు. దీనికి ప్రత్యక్ష సాక్షులైన అలీ అస్ఘర్, చందన్ ప్రభాకర్ లు కపిల్ తో కంటే సునీల్ గ్రోవర్ తోనే ఉంటామని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఘటన నుంచి అభిమానుల దృష్టిని మళ్లించేందుకు తన ప్రియురాలు జిన్నీని పెళ్లి చేసుకోబోతున్నట్టు కపిల్ ట్విట్టర్ లో ప్రకటించినట్టు తెలుస్తోంది.