: శశికళను శపిస్తూ, తిడుతూ పరప్పణ అగ్రహార జైలుకు పోటెత్తుతున్న ఉత్తరాలు
బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఉత్తరాలు పోటెత్తుతున్నాయి. ఈ లేఖలన్నీ శశికళను ఓదార్చడానికో లేక ధైర్యం చెప్పడానికో రాయలేదు. ఆమెను శపిస్తూ రాసినవి. జయలలిత మరణానికి కారణమైన శశికళ నాశనమైపోతుందంటూ శపిస్తూ పలువురు రాసిన ఉత్తరాలు ఇవి. ఇప్పటి వరకు ఇలాంటి ఉత్తరాలు వందకు పైగా వచ్చాయట.
శశికళ, సెంట్రల్ జైల్, పరప్పణ అగ్రహార, బెంగళూరు - 560100 అడ్రస్ కు ఈ లేఖలు వచ్చాయి. ఈ ఉత్తరాలు రాసినవారు అందులో శశికళను నానా తిట్లు తిట్టారు. జయలలిత హత్యకు శశికళే కారణం అని ఆరోపించారు. జయ అనారోగ్యంతో చనిపోలేదని... ప్రణాళిక ప్రకారమే కుట్ర పన్ని చంపేశారని మండిపడ్డారు. తమకు ఎంతో ఇష్టమైన అమ్మను చంపిన నీవు... ఓ వెన్నుపోటుదారువి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీవు చేసిన దారుణాలకు అంతకంతా అనుభవిస్తావని... క్షణక్షణం నరకయాతన అనుభవిస్తావంటూ శపించారు. ఈ లేఖలు తమిళనాడులోని దిండిగల్, కరూర్, తిరుచిరాపల్లి, మధురై, ధర్మపురి, సేలం, చెన్నైల నుంచి వచ్చాయని జైలు సిబ్బంది తెలిపారు.
మొదట్లో ఈ ఉత్తరాలను శశికళ చదివేవారని, ఆ తర్వాత చదవడం మానేశారని అధికారులు వెల్లడించారు. ఇళవరసి కూడా ఈ ఉత్తరాలను చదివేవారని, అభ్యంతరకరంగా ఉన్న వాటిని చింపేసేవారని చెప్పారు.