: పరువు హత్య కలకలం... కన్న కూతురిని చంపి, ప్రియుడి ఇంటి ముందు పడేసి వెళ్లిన తండ్రి
తన కుమార్తె ప్రేమలో పడటాన్ని తట్టుకోలేకపోయిన ఓ తండ్రి, అత్యంత దారుణంగా ఆమెను హత్య చేసి, ప్రియుడి ఇంటి ముందు మృతదేహాన్ని పడేసి, ఆపై నేరుగా పోలీసులకు లొంగిపోయిన ఘటన యూపీలో సంచలనం కలిగించింది. పట్టపగలు నలుగురూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ముజఫర్ నగర్ జిల్లా చార్తవాల్ గ్రామానికి చెందిన జబ్బార్ ఖురేషీ అనే వ్యక్తి బట్టలు కుట్టుకుని జీవిస్తున్నాడు. అతని కుమార్తె గుల్సాబా (15), దిల్ నవాజ్ అహ్మద్ (17) అనే యువకుడితో కలసి గదిలో ఉండటం చూసిన ఖురేషీ భార్య, గదికి తాళం పెట్టి, విషయాన్ని భర్తకు చేరవేసింది. ఈ లోగా తమ కుమారుడిని బంధించారన్న విషయం తెలుసుకున్న అహ్మద్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో, వారు వచ్చి అతన్ని విడిపించారు. ఆపై కాసేపటికి ఇల్లు చేరుకున్న ఖురేషీ, ఆగ్రహంతో కుమార్తె గొంతు నులిమి చంపాడు. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి అహ్మద్ ఇంటి ముందు పడేసి, పోలీస్ స్టేషన్ కు వెళ్లి, తాను చేసిన నేరాన్ని చెప్పి లొంగిపోయాడు. ఈ ఘటనతో చార్తవాల్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు కుటుంబాల బంధువులూ నిరసనలకు దిగారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.