: అమెరికా, బ్రిటన్ ఆంక్షలతో ఎయిర్ ఇండియాకు కాసులపంట?


అమెరికా, బ్రిటన్ దేశాల ఆంక్షలు భారతీయ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియాకు కలిసివచ్చేలా కనిపిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని ఎయిర్ ఇండియా ఎంత వరకు సద్వినియోగం చేసుకోనుందన్నదే ప్రశ్న... మధ్య ప్రాచ్యం, ఆఫ్రికాలోని కొన్ని ముస్లిం మెజారిటీ దేశాలపై ఆంక్షలతో పాటు, మరికొన్ని దేశాల ప్రయాణికులు అమెరికాలో ప్రవేశించేటప్పుడు తమ వెంట ఎలక్ట్రానిక్ సామాన్లు తీసుకురాకూడదని అమెరికా, బ్రిటన్‌ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్‌ ఇండియాకు ప్రయోజనం కలిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా, బ్రిటన్‌ దేశాల నిర్ణయంతో పలు దేశాల నుంచి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో వెళ్లే అవకాశం లేదు. అదే భారత్ నుంచి నేరుగా అమెరికా వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలకు ఈ నిబంధన వర్తించదు. అలాగే బ్రిటన్ కు కూడా ఎయిర్‌ ఇండియా నేరుగా విమానాలు నడుపుతుంది.

ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా నడిపే విమానాల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు మొగ్గు చూపే ఆస్కారముందని వారు పేర్కొంటున్నారు. జెట్ ఎయిర్ వేస్ కు ఈ సౌలభ్యం ఉన్నప్పటికీ అది నేరుగా అమెరికా వెళ్లదు... అబుదాబి మీదుగా అమెరికా చేరుకుంటుంది. దీంతో దీనిలో ప్రయాణికులకు ఆంక్షలు తప్పవు. అందుకే భారత్ నుంచి వెళ్లే ఎయిర్ ఇండియాకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవడంతో భారతీయ విమానయానానికి మహర్దశ కలిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గల్ఫ్‌ విమాన సంస్థల ద్వారా అమెరికా, బ్రిటన్‌ లకు ప్రయాణించే వారిలో 30 శాతానికిపైగా భారతీయులే ఉంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఆంక్షలు ఎయిర్‌ ఇండియాకు శుభవార్తేనని ఆ సంస్థ ఆర్థిక డైరెక్టర్‌ వినోద్‌ హెజ్మది పేర్కొన్నారు. డిమాండు, రద్దీని బట్టి అదనంగా విమానాలను నడపడం గురించి కూడా ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News