: తమిళనాట రెండాకుల గుర్తు ఎవరికీ చెందక పోవడానికి కారణమిదే!
పన్నీర్ సెల్వం, శశికళలు నేతృత్వం వహిస్తున్న రెండు అన్నాడీఎంకే క్యాంపులకూ షాకిస్తూ, రెండాకుల గుర్తును ఎవరికీ ఇవ్వలేమని, ఈ విషయమై పార్టీ గుర్తును తాత్కాలికంగా నిషేధిస్తున్నామని చెప్పిన ఎలక్షన్ కమిషన్, తమ నిర్ణయానికి కారణాన్ని వివరించింది. ఈ గుర్తు తమకు చెందాలంటే, తమకే చెందాలంటూ, ఇరు వర్గాలు 20 వేల పేజీలకు పైగా నివేదికలను కేవలం ఒక్క రోజు ముందు ఇచ్చాయని, ఏ మానవ మాత్రుడికీ, వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం, నిర్ణయం తీసుకోవడం అంత సులువయ్యే పని కాదని పేర్కొంది.
రెండు వర్గాల వాదనలూ పరిశీలించాల్సి వున్నందునే గుర్తును ఎవరికీ ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కాగా, త్వరలో ఆర్కే నగర్ నియోజకవర్గ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పన్నీర్ సెల్వం వర్గం తరఫున ఈ మధుసూదనన్, శశికళ వర్గం తరపున దినకరన్ పోటీ పడుతుండగా, జయ మేనకోడలు దీప, డీఎంకే అభ్యర్థి కూడా రంగంలోకి దిగుతుండటంతో ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా నిలిచింది.