: సురేష్ రైనాను పట్టించుకోని బీసీసీఐ!
బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు పారితోషికాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆటగాళ్ల కాంట్రాక్టులను కూడా పునఃపరిశీలించింది. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లకు కాంట్రాక్టుల్లో స్థానం కల్పించి, పలువురు ఆటగాళ్లకు కాంట్రాక్టుల నుంచి ఉద్వాసన పలికింది. గ్రేడ్ విధానాన్ని అలాగే ఉంచిన బీసీసీఐ స్టార్ ఆటగాళ్ల రెమ్యునరేషన్ ను గ్రేడ్-ఏ కింద పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంది.
గ్రేడ్-ఏ కింద కోటి రూపాయల పారితోషికాన్ని 2 కోట్లకు పెంచింది. ఈ గ్రేడ్ లో ఏడుగురు ఆటగాళ్లకు స్థానం కల్పించింది. వారిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టాప్ ఆర్డర్ ఆటగాళ్లు మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే తోపాటు స్టార్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఉన్నారు.
వారి తరువాత కేటగిరీ గ్రేడ్-బీ లో ఆటగాళ్ల పారితోషికాన్ని 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలకి పెంచింది. ఈ గ్రేడ్-బిలో 9 మంది ఆటగాళ్లకు స్థానం కల్పించింది. గ్రేడ్-బీ ఆటగాళ్ల జాబితాలో యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, కీపర్ సాహా, జస్ ప్రీత్ బుమ్రాలకు స్థానం కల్పించింది.
వారి తరువాతి స్థానాన్ని గ్రేడ్-సీ ఆటగాళ్లు భర్తీ చేశారు. ఈ గ్రేడ్ లో పలువురు యువ క్రికెటర్లకు అవకాశం కల్పించింది. 16 మంది క్రికెటర్లకు స్థానం లభించింది. గ్రేడ్-సీ జాబితాలో సీనియర్ శిఖర్ ధావన్, అంబటి రాయుడు, అమిత్ మిశ్రా, మనీశ్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, హార్డిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రా, కేదార్ జాదవ్, యజువేంద్ర చాహల్, పార్దివ్ పటేల్, జయంత్ యాదవ్, మన్ దీప్ సింగ్, ధావల్ కుల్ కుర్ణి, షార్దుల్ ఠాకుర్, రిషబ్ పంత్ లు స్థానం దక్కించుకున్నారు.
కాగా, టీమిండియాకు ఎన్నో ఏళ్లుగా సేవలందించిన టర్బొనేటర్ హర్భజన్ సింగ్, టీ20 జట్టులో స్టార్ సభ్యుడైన సురేష్ రైనాను కాంట్రాక్టుల్లో పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. హర్భజన్ సింగ్ జట్టులో స్థానం సంపాదించలేకపోయినా... సురేష్ రైనా ఇప్పటికీ టీమిండియా టీ20 జట్టులో సభ్యుడు కావడం విశేషం. దీంతో రైనాను బీసీసీఐ నిర్లక్ష్యం చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రైనా దీనిపై స్పందించాల్సి ఉంది.