: నిన్న లండన్ లో అసలేం జరిగింది?
గత కొంత కాలంగా స్తబ్ధుగా ఉన్న ఉగ్రవాదులు బ్రిటన్ పార్లమెంటుపై పంజా విసిరారు. ప్రశాంతంగా ఉన్న లండన్ పై ఓ ముష్కరుడు విరుచుకుపడ్డాడు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ... అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జిపై ముష్కరుడు కారుతో బీభత్సం సృష్టించాడు. బూడిద రంగు హ్యుందాయ్ ఐ40 కారులో దూసుకొచ్చిన దుండగుడు పేవ్ మెంట్ పై నడుస్తున్న పాదచారులపైకి దూసుకెళ్లాడు. దీంతో ఓ మహిళ సహా ఇద్దరు మరణించారు. అక్కడే మరో 20 మంది గాయపడ్డారు. అదే వేగంతో బ్రిడ్జిపై నుంచి వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ (పార్లమెంట్ భవనం) వైపు దూసుకెళ్లాడు. ఈ వేగంతో ఇనుప రెయిలింగ్ ను ఢీకొట్టి కారు ఆగిపోయింది.
దీంతో పార్లమెంట్ ప్రధాన ద్వారం గుండా భవనం లోపలికి చొరబడేందుకు యత్నించిన ముష్కరుడు, అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారిని కత్తితో పొడిచి చంపాడు. మరో భద్రతాధికారిపై దాడికి తెగబడే ప్రయత్నంలో ఉండగా, సివిల్ దుస్తుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే ఉగ్రవాదిపై కాల్పులు జరిపి హతమార్చారు. అప్పటికే అప్రమత్తమైన బ్రిటన్ ప్రధాని సిబ్బంది ప్రధాని థెరిసా మేను సిల్వర్ జాగ్వార్ కారులో తరలించారు. క్షణాల్లో తన కార్యాలయానికి చేరుకున్న ఆమె అక్కడి నుంచే భద్రతను పర్యవేక్షించారు.
అత్యవసర భద్రతా సమావేశం ఏర్పాటు చేశారు. లండన్ ను భద్రతా దళాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. కీలక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా చర్యలు తీసుకునేందుకు సమాయత్తమయ్యారు. ప్రధానిని కార్యాలయానికి తరలించిన సిబ్బంది... పార్లమెంటు నుంచి బయటకు ఎవరినీ రావద్దని హెచ్చరించారు. ఈ సమయంలో పార్లమెంటులో పలువురు ఎంపీలు, సిబ్బంది ఉన్నారు. కాసేపట్లో ఎమర్జెన్సీ హెలికాప్టర్ పార్లమెంటు ఆవరణలో దిగడంతో ఎంపీల్లో ఆందోళన కలిగింది. అయితే ముందుజాగ్రత్త చర్యగా దానిని తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. హౌస్ ఆఫ్ కామన్స్ (బ్రిటన్ పార్లమెంటు) లో సమావేశాలు నిలిపేశారు. లండన్ చుట్టూ పోలీసు హెలికాప్టర్లు గస్తీకి దిగాయి.
ఈ దాడికి బాధ్యులమంటూ ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు. లండన్ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ ప్రధానితో మాట్లాడారు. ఉగ్రపోరులో అన్ని రకాలుగా సాయం అందిస్తామన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బ్రిడ్జిపై దాడిలో భారతీయులెవరైనా గాయపడి ఉంటే తమ సహాయక బృందాన్ని info. london @ hcilondon. in; 02086295950 ను సంప్రదించాలని సూచించారు. నాగరిక సమాజంలో ఉగ్రదాడులకు అస్కారం లేదని సూచించారు.
#WATCH Shooting outside UK Parliament. (rescue visuals from Westminster Bridge) pic.twitter.com/fCVCBudxm1
— ANI (@ANI_news) March 22, 2017