: మార్పు కోసమే అమెరికన్లు నన్ను గెలిపించారు: ట్రంప్
కచ్చితమైన మార్పు కోసమే అమెరికన్లు తనను గెలిపించారని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, ‘చారిత్రాత్మక మార్పు కోసం గతేడాది నవంబర్ 8న అమెరికన్ ప్రజలు ఓటు వేశారు. కచ్చితమైన చర్యలను ఆశిస్తూ హౌజ్, సెనేట్, వైట్ హౌస్ లను తనకు అప్పగించారన్నారు. ప్రజలు స్పష్టమైన మెజారిటీతో అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు ఇదే సరైన సమయమని ఆయన స్పష్టం చేశారు.
నేటి కీలకమైన ఓటుతో చట్టబద్ధమైన ప్రయత్నం ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక విపత్తు లాంటి 'ఒబామా కేర్' ను రద్దు చేసి కొత్తదాన్ని ప్రవేశపెట్టేందుకు, రిపబ్లికన్ పార్టీకి, దేశ ప్రజలకు కూడా ఆ ఓటు చాలా కీలకమైనదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తాజాగా తీసుకున్న నిర్ణయాలతో దేశంలో నెలకొన్న నూతన వ్యాపార వాతావరణం వల్లే అమెరికన్ల ఉద్యోగాలు వారికి వస్తున్నాయని ఆయన తెలిపారు.