: కోహ్లీ సేనకు చెమటలు పట్టించాలా? అయితే, ఇలా చేయండి!: వ్యూహం చెప్పిన ఆసీస్ మాజీ పేసర్
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో టీమిండియాను ఓడించేందుకు ఆసీస్ కు వెటరన్ లు సహాయ సహకారాలు అందిస్తున్నారు. హోరాహోరీగా జరుగుతున్న ఈ టోర్నీలో విజయం కోసం రెండు జట్లు పోరాడుతుండగా, భారత్ పై పైచేయి సాధించేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు ఆసీస్ ఆటగాళ్లు చేస్తున్నారు. ప్రధానంగా ఆసీస్ మీడియా టీమిండియా కెప్టెన్ తోపాటు కీలక ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని కథనాలు వండి వారుస్తోంది. ఆసీస్ వెటరన్ లు భారత్ లోని పిచ్ లపై పూర్తి సమాచారం కెప్టెన్, కోచ్ కు అందిస్తున్నారు.
తాజాగా ఆసీస్ కెప్టెన్ స్మిత్ కు మాజీ సీమర్ మిచెల్ జాన్సన్ పలు సూచనలు చేశాడు. ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని తెలిపాడు. పిచ్ పై పచ్చిక ఉంటుందని, ఆసీస్ పైచేయి సాధించేందుకు ఇది సరిపోతుందని తెలిపాడు. ఒకీఫ్ కు బదులుగా జాన్సన్ ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. బంతిని బౌన్స్ చేసే లియాన్ తో జట్టుకు ఉపయోగం ఉంటుందని చెప్పాడు. ఈ సిరీస్ లో టీమిండియా అతివిశ్వాసంతో ఉండడంతో ఇప్పుడు ఆందోళనలో పడిందని జాన్సన్ చెప్పాడు. మూడో టెస్టులో పరాజయాన్ని అడ్డుకున్న హ్యాండ్స్ కాంబ్, షాన్ మార్ష్ ను జాన్సన్ అభినందించాడు.