: కొనసాగుతున్న మారుతీ సుజుకీ హవా.. విక్రయాల్లో ఆల్టోకు అగ్రస్థానం!
దేశీయ విపణిలో మారుతీ సుజుకి దుమ్ము రేపుతోంది. మార్కెట్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటోంది. గతేడాది రికార్డును పదిలపరుచుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడుపోయిన తొలి పది రకాల వాహనాల్లో మారుతీ సుజుకికి చెందిన ఆరు ఉండడం గమనార్హం. భారతీయ వాహన తయారీదారుల సంఘం (సియామ్) వివరాల ప్రకారం.. గతేడాది ఇదే సమయానికి మారుతీకి చెందిన ఐదు రకాల వాహనాలు ఈ జాబితాలో చోటు సంపాదించుకోగా ఈసారి ఆ సంఖ్య ఆరుకు చేరింది. ఇక గతేడాదిలాగే ‘ఆల్టో’ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తర్వాతి స్థానాల్లో మారుతీకే చెందిన స్విఫ్ట్ డిజైర్, వ్యాగన్ ఆర్‌లకు చోటు దక్కింది. హ్యుందయ్కు చెందిన గ్రాండ్ ఐ10, ఎలైట్ ఐ 20, రెనోకు చెందిన క్విడ్లు జాబితాలో చోటు సంపాదించాయి. కాగా ఫిబ్రవరిలో ఆల్టో కార్లు 19,524 అమ్ముడుపోయాయి. గతేడాది కంటే దాదాపు రెండువేలు తక్కువే అయినప్పటికీ ఈ ఫిబ్రవరి విక్రయాల్లో టాప్‌గా నిలిచింది.