: నియోజకవర్గాల పెంపు ప్రసక్తే లేదన్న హోం శాఖ సహాయమంత్రి.. అబ్బే.. అదేం లేదన్న వెంకయ్య!
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై నిన్న(మంగళవారం) కొంత గందరగోళం నెలకొంది. నియోజకవర్గాల పెంపుపై టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు, ఏపీలో 175 నుంచి 225 పెంచాల్సి ఉంది. పునర్విభజన ప్రక్రియను 2026 వరకు చేపట్టకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) చెబుతుండడం వల్ల అప్పటి వరకు అసెంబ్లీ స్థానాల్లో మార్పు చేర్పులు కుదరవని ఏజీ పేర్కొన్నారని, కాబట్టి 2026 తర్వాత 2021 జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను పెంచాల్సి ఉంటుందని మంత్రి సభకు తెలిపారు. మంత్రి ప్రకటనతో ఒక్కసారిగా ఏపీ, తెలంగాణలో కలకలం మొదలైంది. బ్రేకింగులతో న్యూస్‌చానెళ్లు హోరెత్తించాయి.
చానళ్ల బ్రేకింగులతో అప్రమత్తమైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెంటనే హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. లోక్‌సభలో హన్స్‌రాజ్ ఇచ్చిన సమాధానంపై చర్చించారు. అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై స్పష్టత ఇచ్చారు. ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాల పెంపునకు సంబంధించి కేంద్ర హోంశాఖలో కేబినెట్ నోట్ తయారవుతోందని పేర్కొన్నారు. హన్స్‌రాజ్ అప్పటికి తనకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఆ సమాధానం ఇచ్చి ఉండొచ్చని వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నియోజకవర్గాల పెంపు ఖాయమని వెంకయ్య తేల్చి చెప్పారు.